మేడారం (సమ్మక్కజాతర)

 మేడారం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని గ్రామం.

ఇది మండల కేంద్రమైన తాడ్వాయి నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 104 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన జయశంకర్ జిల్లా లోకి చేర్చారు. ఆ తరువాత 2019 లో, కొత్తగా ములుగు జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 277 ఇళ్లతో, 1642 జనాభాతో 62 హెక్టార్లలో విస్తరించి ఉంది. 




సమ్మక్క సారక్క జాతర

    ప్రధాన వ్యాసం సమ్మక్క సారక్క జాతర

ఈ జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 90 లక్షల మంది వచ్చారని అంచనా.ఇది విగ్రహాలు లేని జాతర.సమ్మక-సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది .హన్మకొండ బస్టాండ్‌ నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.45 లు బస్ చార్జి ఉంటుంది.కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది. కుంభ మేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తల పిస్తుంది. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలా ది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు.కోయ గిరిజనుల ఉనికికోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర కీ. శ.1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగు తున్నట్లు స్థల పురాణాలు తెలుపు తున్నాయి. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పడిగిద్దరాజు పరిపాలించే వారు. ఇతను కాకతీయుల సామంతరాజు. అప్పటి కరీంనగరాన్ని పాలించిన మేడరాజుకు మేనల్లుడైన పడిగిద్ద రాజు సతీమణి సమ్మక్క. ఆమెకు పగిడిద్దరాజుతో వివాహం జరిపించారు. పగిడిద్దరాజు, సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. మేడారం పరిగణాలను కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలించేవారు.ఓసారి మూడు, నాలుగేళ్ళ పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది.దీంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులేత్తేశాడు. దీంతో ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు. కాకతీయ సైన్యం వంటి ములుగు జిల్లాలోని ములుగు సమీపంలో లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకొని యుద్ధం ప్రకటించారు. పడిగిద్దరాజు అతని కుమార్తెలు, నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి గాంచింది. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది.ఈటెలు, బళ్ళాలతో కాకతీయసైన్యాలను పరుగెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది.తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు. మేడారం జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకు వస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు. మేడారం జాతరకు సుమారు పది రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతాపూజారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకలగుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ రూపంలో తీసుకు వస్తారు.[5] ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకు వస్తారు.భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు.

వేయి స్తంభాల గుడి

 వెయ్యి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం.ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది.



ఇది హన్మకొండ జిల్లా, హనుమకొండ మండలం, హనుమకొండలో పట్టణంలో ఉంది.ఇది వరంగల్ నుండి సుమారు 5 కి.మీ.దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.

ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వార పాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు.

ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం, ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పుణాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది.

ఆలయ ప్రాంగణంలో మరేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయవ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్య కలాపాలకొరకై ఓరుగల్లు కోట, ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా, రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగింది. 2014లో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో కల్యాణ మంటపం క్రింద ఒక బావి వెలువడింది

మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వెస్తే రాలనంతగా భక్త జన సందోహం రుద్రేశ్వరున్ని దర్షిస్తారు. మహాన్యాస పుర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యపూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందనడం నిస్సంశయం.

ఇంతటి ప్రశస్థి కల ఈ ఆలయానికి దూరప్రాంతాల వారు ఖాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషను చేరుకున్న పిదప బస్సు లేక ఆటోల గుండా 5 కి.మీ. దూరంలో నున్న హనుమకొండ నగరానికి చేరుకొని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు.

మహానంది

 మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని నంద్యాల జిల్లా, మహానంది మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం.


ఇది ప్రముఖ శైవ క్షేత్రం.ఇది నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కుట వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.


 
ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్ఛమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది పొడవునా ఒకేస్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాల్లేకుండా తేటగా.. సూది సైతం స్పష్టంగా కనబడేస్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం! ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే ఉంది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. ఈ మహానంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) ఉన్నాయి. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రథోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు.ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే, గర్భాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం ఉంది. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. అదే విధంగా స్థంబాలపై, గాంధీ మహాత్ముని ప్రతిమ, ఇందిరా గాంధి ప్రతిమ, జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశ భక్తిని చాటుకున్నాడు.ఈ క్షేత్రం 19వ శతాబ్ది తొలిభాగంలో కీకారణ్యంగా ఉండేది. 1830లో ఈ ప్రాంతానికి కాశీయాత్ర లో భాగంగా వచ్చిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో భాగంగా ఆ వివరాలు వ్రాశారు. గుడి చుట్టూ సకలఫల వృక్షాలూ ఉండేవనీ, గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేది కాదని ఆయన వ్రాతల వల్ల తెలియవస్తున్నది. అప్పట్లో అన్ని వస్తువులు బసవాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. చివరకు నిప్పు దొరకడం కూడా ప్రయాసగానే ఉండేదని ఆయన వ్రాశారు. రాత్రిపూట మనుష్యులు ఉండరనీ తెలిపారు. అర్చకునిగా తమిళుడు ఉండేవారనీ, వచ్చినవారు తామే శివునికి అభిషేకము చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపారు. అర్చకుడు ప్రతిదినం ఉదయం తొలి జాముకు వచ్చి ఆలయగర్భగుడి తెరిచేవారు. గోసాయిలు, బైరాగులు రెండు మూడు రోజులు ఆ స్థలంలోనే ఉండి పునశ్చరణ చేసేవారు. మొత్తానికి 1830ల నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైనా సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేది[1].నంద్యాల నుండి మహానందికి బస్సు సౌకర్యము ఉంది. గిద్దలూరు-నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె, ఇక్కడికి సమీప రైల్వే స్టేషను.
విషయాలు



    1 క్షేత్రచరిత్ర/స్థలపురాణం

    2 నవనందులు

    3 మహానంది ఆలయ చిత్రాలు

    4 మూలాలు


క్షేత్రచరిత్ర/స్థలపురాణం

పూర్వీకులు తెలిపిని కథానుసారం.. ఒక రుషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడై ఎల్లప్పుడు తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయన్ను అంతా శిలాదుడని (శిలాద మహర్షి) పిలిచేవారు. భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా.. ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించిన అత్యంత నిష్టతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై... కావల్సిన వరాలు కోరుకొమ్మన్నాడు. దేవాధిదేవుడ్ని చూసిన పారవశ్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మరిచిపోయాడు! మహాదేవా.. నీ దర్శన భాగ్యం లభించింది. ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి? నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రీ.. అని వేడుకున్నాడు. అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మరిచిన భార్య ఆకాంక్షనూ గుర్తుంచుకుని.. మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్లిపోయాడు. ఆమేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది... మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు.. అంటూ ఆ బాలుడిని అప్పగించాడు. వారు ఆ బిడ్డకు ‘ మహానందుడు’ అనే పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వత్సా.. వరం కోరుకో.. అనగా.. మహానందుడు... దేవాధిదేవా.. నన్ను నీ వాహనంగా చేసుకో... అని కోరాడు. అలాగే అని వరమిచ్చిన శివుడు ‘మహానందా.. నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలూ ప్రవహిస్తూ, సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కి.మీ.ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది. అని వరమిచ్చాడు. తాను ఇక్కడి నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు.

మరియొక కథ: ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది. ఆపుట్టమీద రోజూ ఒకకపిలగోవు వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది. పశువులకాపరి ఒక ఇది చూచాడు. పుట్టక్రింద బాల శివుడు నోరుతెరచి ఈపాలు త్రాగుతుండేవాడు. ఈదృశ్యం ఆగొల్లవాడు పెద్దనందునితో చెప్పాడు. నందుడువచ్చి చూచాడు. ఆదృశ్యం కంటబడింది. తన్మయుడయ్యాడు. గోవు భయపడింది. అదు పుట్టను తొక్కి పక్కకు పోయింది. ఆ గిట్టలు ఆపుట్టమీద ముద్రితమైనవి. ఇవాల్టికు కూడా అవి మనం చూడవచ్చును. నందుడు తను చేసిన అపరాధానికి విచారించాడు. ఇష్టదైవమైన నందిని పూజించాడు. ఆవు తొక్కిన పుట్ట శిలాలింగం అయ్యేటట్లు నంది ప్రసాదించింది. గర్భాలయం ఎదుట పెద్దనంది ఉంది.దాని ఎదుట చక్కటి పుష్కరిణి. ఈ రెండిటివల్ల ఈ క్షేత్రానికి మహానంది తీర్ధము అనే పేరు వచ్చింది. దేవాలయం ప్రాకారం బయట విష్ణుకుండం, బ్రహ్మకుండం అనే రెండు కుండాలు ఉన్నాయి. త్రిమూర్తిత్త్వానికి గుడిలో స్వామివారు అతీతులు. లింగం ఏర్పడిన వంకలు ప్రకృతి పురుష తత్త్వాలను తెలుపుతాయి. భైరవజోస్యుల మహానందయ్య గారి భార్య ఈ ఆలయ నిర్మాణానికి కారకురాలు. ఇక్కడ ఉన్న కామేశ్వరీదేవి ఎదుట ఉన్న శ్రీచక్రం శంకరాచార్యుల ప్రతిష్ఠ.
నవనందులు
కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.

అహోబిలం

 అహోబిలం, నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆళ్లగడ్డ నుండి 22 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నంద్యాల నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన అహోబిల మఠ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కారణంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా పేరొందింది.



భౌగోళికం

ఇది మండల కేంద్రమైన ఆళ్లగడ్డ నుండి 22 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నంద్యాల నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది.


దిగువ అహోబిలం ఆలయం, ఆహోబిలం
సమీప గ్రామాలు
ఆలమూరు 9 కి.మీ, ఆర్.కృష్ణాపురం 11 కి.మీ, టి.లింగందిన్నె 11 కి.మీ, నరసాపురం 11 కి.మీ, ముత్తలూరు 13 కి.మీ.


2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1019 ఇళ్లతో, 3732 జనాభాతో 1350 హెక్టార్లలో విస్తరించి ఉంది. మగవారి సంఖ్య 1898, ఆడవారి సంఖ్య 1834. [1].

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,280. ఇందులో పురుషుల సంఖ్య 1,641, మహిళల సంఖ్య 1,639, గ్రామంలో నివాస గృహాలు 771 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,350 హెక్టారులు.


అహోబిల మఠం

ప్రధాన వ్యాసం: అహోబిల మఠం

భవనాశని జలపాతం

అహోబిలంలో ఉగ్రస్తంభానికి చేరుకునేందుకు వెళ్లాల్సిన మార్గం
అహోబిల మఠం (శ్రీ అహోబిల మఠం అని కూడా పిలుస్తారు) అనేది వడకలై శ్రీ వైష్ణవ మఠం సా.శ. 1400 లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, అవిభాజ్య కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం, అహోబిలంలో వేదాంత దేశిక వడకళై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది.[2] ఇది ఆదివాన్ శతకోప స్వామి (వాస్తవానికి శ్రీనివాసాచార్య అని పిలుస్తారు)కి ఆపాదించబడింది.]

రవాణా సౌకర్యాలు

రోడ్డు మార్గం: హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.కడప,తిరుపతి నుండి వచ్చువారు, చాగలమర్రి నుంచి ముత్యాలపాడు, క్రిష్టాపురం, బాచేపల్లి మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు.
రైలు మార్గం: అహోబిలం దగ్గరలోని రైలు నిలయం నంద్యాల. చెన్నై-బొంబాయి రైల్వేమార్గంలో గల కడప స్టేషన్‌లోదిగితే, ఆళ్లగడ్డ మీదుగా 115 కి.మీ. దూరంలో రహదారిమార్గంలో చేరవచ్చు.
విమాన మార్గం: అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం కర్నూలు
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి ఆళ్లగడ్డలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆళ్లగడ్డలోను, ఇంజనీరింగ్ కళాశాల కె. కందుకూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ నంద్యాలలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నంద్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కర్నూలు లోనూ ఉన్నాయి.

భూమి వినియోగం
అహోబిలంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

అడవి: 368 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 204 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 59 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 183 హెక్టార్లు
తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 48 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 21 హెక్టార్లు
బంజరు భూమి: 25 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 440 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 423 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 63 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

కాలువలు: 31 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 24 హెక్టార్లు* చెరువులు: 8 హెక్టార్లు
ఉత్పత్తి
ప్రధాన పంటలు
వరి, కందులు, మినుములు

ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు