ఇన్నాళ్ళూ
సమాజం ఒక సంకెళ్ల చెరసాల!
హత్యలు జరిగిన చెరసాల!
నెత్తురు పారిన చెరసాల!
దుర్మార్గులు కట్టిన చెరసాల!
ఒక పెద్ద చెరసాల!
బానిసత్వ శాస్త్రం
శాసించిన పూజారులు
నెత్తుటి కత్తులు
ఝళిపించిన సామ్రాట్టులు
హత్యా మంత్రాంగం
పన్నిన అమాత్యులు
దుర్మార్గులు మఠాధిపతులు
నరహన్తలు మతాధినేతలు
ఒకటై
జరిపించిన ఘోరహత్య
తగిలించిన అనల శృంఖల
కట్టిన బానిసత్వ కారాగృహమది
గత కాలపు సమాజ పద్ధతి!
పుణ్యం పేరిట
యజ్ఞంలో నరికిన
పసి మేకల శిరస్సులూ
ఉరి బండల
ఆహుతైన
పతిత ప్రజా శిరస్సులూ
పూజారీ కర్మల్లో
రాజన్యుల కత్తుల్లో
నలిగిన అనాథుల ఆక్రందన
ఇదేనా
పూర్వపు సమాజ నిర్మాణం?
పర పీడనకై
పరిపాలనకై
స్వార్థ పరులు
తమ అధికారం నిలుపుకోను
మతాధి నేతలు
వ్రాసిన దుర్మార్గపు శాస్త్రశాసనం
తగిలించిన నియమ శృంఖల
రాజులు
ఏకచ్ఛత్రంగా
ఏలిన శవ సామ్రాజ్యం
ఇదే కదా గతకాలపు
సమాజ పద్ధతి!
పూజారుల అధికారం
రాజన్యుల నియంతృత్వం
కట్టిన పెద్ద జైలు కొట్టు
చేసిన మహాహత్య
ఇదే కదా పూర్వపు
సమాజ చరిత్రమంతా!
గుండెలు మంటలుగా
కన్నులు కాలువగా
మారుతాయి
ఈ సమాజ హత్యా చరిత్ర చూస్తే!
రాజన్యుల
రథ చక్రపు
ఘట్టనలో
పడి నలిగే
దీనులార!
మతాధి నేతల
శాస్త్రాల చెప్పుల క్రింద
నలిగి నలిగి రోదించే
పసితనంలో పతి పోయిన
అమాయక కన్యలార!
స్వేచ్ఛ లేక
సమ్రాట్టుల
నేత్రాగ్నుల
దగ్ధమైన
జాతులార!
మరలో
మరగా
అరిగిపోవు
కార్మికులారా!
జమీందార్ల
పొట్టలు నింపను
ధాన్యం పండించే
కర్షకులారా!
ఓహో!
ఓహో!
అణగారిన
ప్రపంచ దీనులారా!
మీకై
ఈనాడొక
అగ్ని పర్వతం
పగులుతోంది చూచారా!
మీకై
ఈనాడొక
అరుణ పతాకం
ఎగురుతోంది చూచారా!
మీకై
ఈనాడొక
నవజగత్తు
ప్రభవిస్తున్నది చూచారా!
మీకై
ఈనాడొక
నందనవన వసంత మందారం
కుసుమించెను చూచారా!
మీకై ఈనాడొక
రణభేరి
పగిలింది విన్నారా! ( నయాగరా ఖండకావ్య సంపుటి నుండి)