పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజు గా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉన్నది. శైవులకు దేవాలయం చిదందరం ఇతిహాసం ప్రకారం పరమశివుడు ఒకనాడు తిల్లాయ్ వనవిహారానికి వెళ్ళాడు.ఈ వనంలో ఉన్న ఋషులు తమ మంత్రాలతో దేవతలను ఆవాహనం చేయగల్గినవారు. శివుడు ఆ ఋషులు పఠిస్తున్న మంత్రాలతో లొంగి పీతాంబరధారి అయి ఉసిరి కాయలు తింటున్నాడు. శివుని భార్య పార్వతి కూడా శివుని వెంబడించింది.ఋషులు, ఋషి పత్నులు ఆ పీతాంబర వాసిని అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు. తమ భార్యలూ, ఇతర స్త్రీజనం మోహితులై ఉండటం చూసిన మునులు కోపోద్రిక్తులై తమ మంత్ర ప్రభావంతో ఎన్నో పాములను ఆవాహన చేశారు. భిక్షువు రూపంలో ఉన్న భగవంతుడు ఆ పాములను ఎత్తి జడలు కట్టిన జుత్తు చుట్టూ, మెడలో మరి నడుము చుట్టూ ఆభరణాల్లా వేసుకున్నాడు. ఆవేశం పట్టలేని ఋషులు ఒక భయంకరమైన పులిని ఆవాహన చేశారు. భగవంతుడు దాని చర్మం వలిచి నడుముకి బట్టగా కట్టుకున్నాడు.
పూర్తిగా విసుగెత్తిన ఋషులు వారి ఆధ్యాత్మిక శక్తిని మొత్తం ఉపయోగించి 'ముయలకన్' అనే శక్తిమంతమైన మరియు అహంభావియైన రాక్షసిని ఆవాహన చేశారు. చిరు మందహాసం చిందిస్తూ భగవంతుడు ఆ రక్కసి వీపుపై కాలు మోపి దాన్ని నిశ్చలనం చేసి దివ్యమైన ఆనంద తాండవం చేసి తన అసలు రూపాన్ని చూపాడు. ఋషులు భగవంతుడిని గుర్తెరిగి, తమ మంత్ర తంత్రాలు పని చేయవని తెలుసుకొని ఆయనకు దాసోహమన్నారు. చిదంబరం చిత్సభలో నటరాజమూర్తి. ఎడమ ప్రక్క ఉన్న మూర్తి చిదంబర రహస్యం - సువర్ణ బిల్వ పత్రాలు మాత్రం కనుపిస్తాయి. కుడివైపున అమ్మవారు శివకామసుందరి. పురాణాల ప్రకారం, శివుడు తన దివ్యమైన 'ఆనంద తాండ'వాన్ని నటరాజు రూపంలో ఆ ఇద్దరు సాధువులకు తమిళుల 'తాయ్' (జనవరి-ఫిబ్రవరి) నెలలో పూసమ్ నక్షత్రపు తేదీన చూపాడు.
పరమశివుడు ఆనంద తాండవం చేసిన స్థలంలో - 'తిరుమూలతనేశ్వర్' ఆలయానికి దక్షిణంగా - ఇప్పుడు శివుడు నృత్య భంగిమలో కనిపించే పొన్నాంబళం/పోర్ సబై ('పొన్'అంటే బంగారం 'సబై' అంటే సభ లేదా వేదిక) ఉంది. ఇక్కడి దేవుణ్ణి 'సభానాయకర్' - అంటే వేదికపై కొలువైన దేవుడు - అని కూడా పిలుస్తారు.
ఈ బంగారు తాపడం చేసిన వేదిక చిదంబరం ఆలయపు గర్భగుడి లో స్వామి మూడు రూపాల్లో దర్శనమిస్తారు:
1) సంపూర్ణ రూపం - నటరాజు రూపంలోని స్వామి 2) అసంపూర్ణ రూపం - స్ఫటిక రూపంలోని చంద్ర మౌళీశ్వరర్ 3) నిరాకారం - పంచ భూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భ గుడిలోని ఖాళీ స్థలం
ఈ విధంగా చిదంబరం పంచభూత స్థలాల్లో (పంచభూతములు - భూమి, నీరు, నిప్పు, గాలి మరియు ఆకాశం) ఒకటిగా వెలుగొందుతోంది. మిగిలినవి - భూ స్వరూపంగా కొలువబడుతున్న కాంచీపురం లోని ఏకాంబరేశ్వరర్ దేవాలయం, నీటి స్వరూపంగా కొలువబడుతున్న తిరుచ్చిరాపల్లి దగ్గరలోని తిరువనైకవల్ లో గల జంబుకేశ్వరర్ దేవాలయం, అగ్ని స్వరూపంగా కొలువబడుతున్న తిరువణ్ణామలై లోని అన్నమలైయర్ దేవాలయం మరియు గాలి స్వరూపంగా కొలువబడుతున్న శ్రీ కాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయం.
పరమశివుడు నృత్యం చేసినట్లుగా చెప్పబడే ఐదు స్థలాల్లో చిదంబరం కూడా ఒకటి. ఈ స్థలాలు అన్నింటిలోనూ వేదిక/సభ లు కనిపించడం విశేషం. చిదంబరం కాక మిగిలిన ప్రాంతాలు తిరువాలంగడు లోని రత్తినసబ , కౌర్తాళ్ళం లోని చిత్రసభ, మదురై లోని మీనాక్షి దేవాలయంలోని రజతసబ మరియు తిరునెల్వేలి లోని నెల్లైఅప్పర్ దేవాలయంలోని తాంర సభ. ఈ దేవాలయానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ తొమ్మిదిలో 4 పెద్ద గాలి గోపురాలు( తూర్పు, పశ్చిమ , ఉత్తర, దక్షిణ దిక్కులలో). ఈ నాలుగు గాలి గోపురాలు చాల పురాతనమైనవి. తూర్పు గాలి గోపురము మీద 108 ముద్రలతో భరత నాట్యం చేస్తున్న శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయ సముదాయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ ఆలయ సముదాయములోనే ఒక పెద్ద తటాకము (శివ గంగ) మరియు చిన్న ఇళ్ళు ఉన్నాయి. ఇవి కాక ఐదు సభలు లేదా వేదికలు ఉన్నాయి. అవి - గర్భగుడిగా వెలుగొందుతున్న చిత్సబై, చిత్సబైకి ఎదురుగానే ఉన్న నిత్యపూజలు జరిగే కనకసబై, గర్భగుడికి ఎదురుగానే శివుడు 'కాళి' తో నాట్యమాడినట్లుగా చెప్పబడుతున్న నృత్యసబై లేదా నాట్యసబై - ఇది శక్తి స్వరూపం, భగవంతుడి ఆధిపత్యాన్ని చాటి చెప్పిన ప్రాంతం, రాజ్యసబ లేదా 1000 స్తంభాల మంటపం. నిజానికి ఉన్నది 999 స్తంభాలే, భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు ఆయనే 1000వ స్తంభం మరియు పంచమూర్తులు కొలువైన దేవసభ (పంచ - ఐదు, మూర్తులు - భగవంతుడి విగ్రహాలు. ఆ ఐదు ఏవంటే గణేశుడు - విఘ్నాలు తొలగించే స్వామి, తన భార్య 'శివానందనాయకి'తో కూడి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే సోమస్కందర స్వామి, మురుగా స్వామి మరియు భక్తముఖ్యుడు, ప్రధాన భక్తుడు ఐన చండికేశ్వర్).
ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ్, ఆయన దేవేరి పుండరీగవల్లి తాయరు దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని తిల్లై తిరుచిత్రకూటమ్ అంటారు. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలు లో ఒకటి. దివ్యదేశాలంటే ప్రముఖ భక్తులైన ఆళ్వార్లు మంత్రాలు చదివి శుద్ధి (మంగళాశాసనం) చేసిన విష్ణ్వాలయాలు.
ఆలయ ప్రాంగణంలో ఇంకా చాలా చిన్న ఆలయాలు ఉన్నాయి.
ఆలయపు రూపకల్పనలోనూ, స్థాపత్యంలోనూ (స్థాపత్యం - ఆర్కిటెక్చర్) వేదాంతార్థాలు కోకొల్లలు. ఉన్న తొమ్మిది ద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను సూచిస్తాయి. గర్భగుడిని ఒక ప్రక్కనున్న కనకసభ అనే వేదిక పైనుంచి పంచాచ్ఛరపది అనే ఐదు మెట్లు ఎక్కి చేరుకోవాలి. పంచాచ్ఛరపది అంటే : పంచ - ఐదు, అ-చ్ఛర - నాశము లేని శబ్దాలు శి వా య న మ . పొన్నాంబళం హృదయానికి ప్రతీక కనుక వేదిక పక్క నుంచి వెళ్ళడం (మిగతా దేవాలయాల్లో మాదిరి ముందు నుంచి కాకుండా). పొన్నాంబళం లేదా గర్భగుడిని 28 స్థంభాలు మోస్తున్నాయి. ఇవి 28 ఆగమాలను (ఆగమాలు శివుడిని అర్చించే వైదిక విధానాలు) సూచిస్తాయి. ఇక ఆలయం పైకప్పుని 64 కళలకు ప్రతీకలైన 64 దూలాలు, అంతు లేని రక్తనాళాలకు ప్రతీకలైన ఎన్నో అడ్డ దూలాలు మోస్తున్నాయి. పైకప్పుని 21600 శివయనమ అని రాసిన బంగారు పలకలతో కప్పారు. ఇవి 21600 శ్వాసలను సూచిస్తాయి. కప్పుపై 9 రకాలైన శక్తిని సూచించే 9 పవిత్ర కుంభాలు లేదా కలశాలతో తీర్చిదిద్దారు (చూ. ఉమాపతి శివమ్ రచించిన కుంచితాంగ్రిస్తవం) 7 చిదంబర రహస్యం
చిదంబరంలో శివుడు నిరాకారుడిగా కొలువబడుతున్నాడు. స్వామి తన దేవేరి శక్తి లేదా శివగామితో అనంతంగా తన దివ్యమైన 'ఆనంద తాండవం' చేస్తుంటారని ప్రతీతి. దీన్ని గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ స్థలాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు 'విల్వ' (బిల్వ) పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్నీ ముక్తినీ సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది.
No comments:
Post a Comment