ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. [1]. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.
తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువు గా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తి ని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్ట లో కనుగొని, శ్రీవారి మూర్తి ని ప్రస్తుతం వున్న ప్రదేశం లో ప్రతిష్టించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితులు యొక్క వంశీయులే పరంపర గా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
“ | వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!
| ” |
స్థల పురాణం
ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళిస్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు, శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.
చరిత్ర
- మరింత సమాచారం: తిరుమల చరిత్ర వ్యాసంలో
19 వ శతాబ్దాంతానికి... కొండపైన శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది.1933లో ఏర్పడిన తితిదే బోర్డు రూ.26 వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 1980 లో తితిదే బోర్డు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుద్దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది.
15 వందల ఏళ్ల నుండి తిరుమల, పాలకుల ఆదరణకు నోచుకుంటూ ఉంది. క్రీ.శ.614. పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది. సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్టింపజేసింది. ఇదే తిరుమల ఆలయం లో మొట్టమొదటి కానుక గ దేవాలయం లో ని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429లో, హరిహరరాయలు క్రీ.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
సాళువ నరసింహరాయలు 1470 లో భార్య, ఇద్దరు కుమారులు, తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్థంభాల మండపాలను నిర్మించాడు. 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుత రాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు, ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకగా ఇచ్చాడు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరలో, అన్నా ఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.
విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్ కు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు, ఆలయంపై పన్నులు విధించాడు. ఈ విషయంగా మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. 1740లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు. తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి ఆధీనంలోకి వచ్చింది. 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున అలయ నిర్వహణను మహంతులకు అప్పజెప్పారు.
No comments:
Post a Comment