తల్లి మనసు కధలు పేజి

  తల్లి మనసు కధలు పేజి 1

                                 


                                        తల్లి మనసు
                                                                               డి. కామేశ్వరి

 

                                        

   
    పావుతక్కువ తొమ్మిదయింది . కమల గబగబ జడ అల్లుకుని, ముఖానికి యింత పౌడరద్దుకుని వంటింట్లోకి వెళ్ళింది.
    పొయ్యి మీద యింకా ఏదో వుడుకుతూనే వుంది. అత్తగారికింకా గిన్నెలతో కుస్తీ పడుతుంది. వంటకాలేదన్న మాట! తెలిసినా అడిగింది కమల "వంటయిందాండి.... తొందరగా ఆఫీసు కెళ్ళాలి యివాళ ...."
    "ఆ! ఆ ! అవుతుంది. చూస్తున్నావుగా నేనేం కూర్చున్నాన్నా! అక్కడికీ రోజుకంటే అరగంట ముందే మడికట్టు కున్నాను. ఉడకాలా వాటితో పాఫు నేనూ వుడుకుతానా? ఇదిగో యీ పప్పుదింపి ఆ పులుసు పోపు కూరపోపు వేసి పెడ్తాను.... దిక్కుమాలిన కర్రలు మండి చస్తేనా? ఊదిఊది నోరు పడిపోతుంది కళ్ళు పోతున్నాయి...." సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది.
    ఈ భాగోతం రోజూ వినేదే కనుక కమల ఆ మాటలు వినకుండా పీటవాల్చుకుని కంచం పెట్టుకుని, మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. "ఎంతవరకయితే అదే పెట్టేయండి. తొమ్మిదిన్నరకి అక్కడుండాలి నేను. ఇన్ స్పెక్టన్ వుంది. "ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని; అయినా ఆవిడకేం లెక్క! వుండవే అలా కాళ్ళ క్రింద నిప్పులు పోసేస్తే ఎలా చస్తాను ----" అంటూనే పప్పులో యింక ఉప్పు వేసి కుమ్మి అదే యింక కంచంలో పడేసింది. తీర్దానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఒగిన్నేలో పోసింది. ఉమ్మగిల్లని అన్నం యింత పడేసింది కంచంలో . "కూర అవనీయవు.... ఏం ఉద్యోగాలో నీవే చేస్తున్నట్టున్నావు..... నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా ...." అదో యింత ముద్ద పడేసింది సుబ్బమ్మ.
    కమల దేనికి జవాబియ్యకుండా ఊదుకుంటూ యింత పప్పు అన్నం కలుపుకుని తిని మజ్జిగ వేసేసుకుంది.
    "అయ్యో రాత! ఏమిటే ఆ తిండి " సుబ్బమ్మ నోరు వాగుతూనే వుంది. కమలకిదేం క్రొత్తగాదు యీ యింట్లో ఏనాడో చెవులు, నోరు మూసుకోవడం అలవాటయింది కమలకి.
    ఇదేం క్రోత్తా! రోజూ ఆఫీసు వేళకి యింత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు, అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది . మజ్జిగ త్రిప్పుతుంది. గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమిరిస్తే ఆ వంట కాస్తా వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని వూరుకోడం గాని యీ మాత్రం వంట అరగంటలో వండి, తిని, ఆఫీసు కెళ్ళగలదు తను. రోజూ యిలాంటి భోజనం అలవాటే, ఉడికీ ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగీ కాగాని పులుసుతో ఏదో యింత నోట్లో పడేసుకుని అదర బాదరా అఫీసుకి పరిగెత్తడం తనకి ఆయనకీ అలవాటే రోజూ ! ఈతిండితో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూరకాడల్లా వాడిపోవడమూ అలవాటే. మధ్యలో అక్కడ త్రాగేది కప్పు కాఫీ!
    "వాడెడి ? వాడు రాకుండానే తినేసి పోతావుటే....?"
    కమల జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూలపడేసి చేయి కడుక్కుంది.
    ఆయనగారు తిన్నాక అవిస్తట్లోనే తినాలి. పతివ్రతా ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీసుకి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు! మొగుడంటే భక్తీ గౌరవం లేనట్టు లెక్క గాబోలు ముందు తింటే !
    ఆఫీసులో ఇనస్పెక్షన్ వుంది. తొమ్మిదిన్నరకి అక్కడ ఉండాలి. రెండు బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే తొమ్మిదయింది ... ఆయనగారు వచ్చి అయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది ?
    కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకుని బేగు రుమాలు తీసుకుని గబగబ వెళ్ళింది వీధిలోకి.
    గుమ్మంలోనే ఎదురు పడ్డాడు సుబ్బారావు . సైకిలికి ఎడాపెడా సంచులు తగిలించుకుని "అప్పుడే ఎక్కడికి బయలు దేరావు?" భార్యని చూసి అడిగాడు.
    "ఆఫీసుకి."
    "తొమ్మిదే అయింది ఎందుకా తొందర భోం చేసి వస్తాను, వుండు వెడదాం.'
    "నాకు పనుంది. తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళండి. ' తప్పించుకొని మెట్లు డిగింది కమల.
    "ఏమిటో ఆ అర్జంటు పని ! ముందెళ్ళి అందరితో బాతాఖానీ కొట్టాలా వెళ్ళు ..... వెళ్ళు.... అక్కడే కబుర్లు నీకోసం చూస్తుంటాయి."
    "ఏదీ పోనీ పాపం బస్సులు అవి వంటరిగా మారలేదని" కమలకు వళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడి వైపు. 'అవును బాతాఖానీ కొట్టడానికే వెడుతున్నాను. దారి వదలండి' రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబీయటం ఇష్టం లేక మొహం త్రిప్పుకుని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు.
    బాతాఖానీ కొట్టడానికి వేడుతూందిట..... 'అందుకోసం గంటముందు తిండన్న తినకుండా ఆదరాబాదరా బయలుదేరింది ! హ ఏం మగాళ్ళు! ఓ పావుగంట ముందు వెడితే ఎందుకోనని అనుమానం! ఆఫీసులో మొగాళ్ళతో పెళ్ళాం ఖాతాఖానీ కొడుతుందేమోననే మొగాళ్ళు  భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశ పెట్టడం! భార్య తెచ్చే డబ్బు కావాలి! కాని ....ఆభార్య తోటి ఉద్యోగాస్తునితో నన్నా ఓ మాట మాట్లాడకూడదు నవ్వకూడదు. తలవంచుకొని ఆఫీసుకెళ్ళి ఇంటికి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకుని పైకి పెద్ద ఆదర్శ వాదుల్లా అభ్యుదయ భావాలు గల వారిలా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్టు ఫోజు....! .... హ బస్సులు ఎక్కలేదట! ఏ బస్సులు ఎక్కకుండానే రెండేళ్ళ బట్టి ఉద్యోగం చేస్తుంది గాబోలు! ఎంత చులకన ..... పెళ్ళాం అంటే ..

 

Full PDF  Click Here